27.01.2017

సాక్షి సాధన
శ్రీ విద్యాసాగరుల బోధ

చిత్త వృత్తులను నిర్వాణానికి ముందే తెలుసుకోవచ్చు. కానీ వాటిని రద్దు చేసుకునేందుకు నిర్వాణస్థితి ఉండాలి. శ్వాస, మనసు స్వాధీనమయిన స్థితిలో చిత్త వృత్తులను తెలుసుకోవచ్చు.

చిత్త వృత్తులు = సంకల్పం, వికల్పం, విపర్యయం, స్మృతి, నిద్ర.

ఈ అయిదింటినీ బీజస్థితిలో వాటివాటిగా ఉన్నప్పుడే తెలుసుకోవాలి అంటే గుణాలు దాటిన స్థితిలో ఉంటేనే తెలుసుకోగలుగుతారు. గుణాలను దాటకుండా చిత్త వృత్తులను తెలుసుకోలేరు. గుణాలను దాటితేనే చిత్త వృత్తి నిరోధం. అయితే వాటిని తెలుసుకోడం, తెలుసుకునే ప్రయత్నం అనేది గుణాలను దాటక ముందే చేయవచ్చు. తెలుసుకోడం వేరు. నిరోధించడం వేరు.

పాత ఆలోచనలే మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి. కొత్తవేమీ రావు.
ఎందుకంటే స్మృతి జ్ఞానమే జీవుడంటే”.

స్మృతి జ్ఞానం వల్లే కదా జీవితం అంతా కొత్త పనులు చేస్తున్నానాని అనుకుంటావు,
కానీ పాత స్మృతిలో ఉన్న సుఖ దుఃఖాలనే మళ్ళీ మళ్ళీ పొందుతున్నావు. ఇది తింటే బాగుంటుంది. ఇది చుస్తే బాగుంటుంది. ఇది వింటే బాగుంటుంది. ఇది చేస్తే బాగుంటుంది. ఇలా ఇంద్రియ జ్ఞానంతో ఉన్నదంతా కూడా ఆ స్మృతి జ్ఞానంతో కూడిన సుఖ దుఃఖాలే. కానీ, ఎప్పటికప్పుడు అవి కొత్తగా కనిపిస్తుంటాయి. అలా కొత్తగా కనపడడం వలన నువ్వు వాటిచేత ప్రేరేపింపబడి తాదాత్మ్యత చెంది వాటిచేత సుఖదుఃఖాలను అనుభవిస్తున్నావు. కాబట్టి ఇవి పాతవే కదా!

ఏ కొత్త సుఖం ఉంది? ఇందులో... అని
ఆకర్షణ నుంచి బైట పడాలి.
ఆ సంగత్వం నుంచి బైట పడాలి.
ఆ గుణం నుంచి బైట పడాలి.

అలా మూడు గుణాలను నుంచి బైట పడాలి.
అలా సాక్షిగా ఉన్న స్థితి వస్తే తప్ప, ఎవరికీ చిత్త వృత్తి నిరోధం సాధ్యం కాదు.

నిర్వాణం = చిదాకాశ స్థితిలో ఉండటం = చైతన్య స్వరూపుడిగా ఉండటం

నీవే.... చైతన్యంగా మూడు అవస్థలలో ఉంటే... అప్పడు నిర్వాణం.
నిర్వాణం తర్వాత తురీయం.

సాక్షి సాధన ఎప్పుడూ కూడా బలవంతంగా చెయ్యకూడదు.
ఆత్మ విచారణలో ఆనందం ఉండాలి గాని దుఃఖం ఉండకూడదు.

You should do it with ease.
తేలికగా చెయ్యాలి.

విచారణ సరిగ్గా చేసి convince చేయడం వస్తే... అప్పుడు తేలికగా సాధన చేయడం వస్తుంది.

పాము తలమీద కాలు పెట్టినంత సేపు కాటువేయకుండా ఉంటుంది. కాలు తీయగానే కాటేస్తుంది. మనసు కూడా అంతే.

బలవంతంగా మనసును ఆపడం సరైన పద్ధతి కాదు.

ఆలోచనా ప్రవాహాన్ని ఉపేక్షించి చూడాలి.
నిరోధించడం అంటే ఆపడం కాదు.
తొలగించడం కాదు.
ఉదాసీనంగా ఉండి చూడడమే నిరోధం.

ఉదాహరణకి,    
కొండమీద ఎక్కి ప్రపంచాన్ని చూడటం....
ప్రపంచం లోకి దిగి ప్రపంచాన్ని చూస్తే అన్నీ కనపడుతాయి.
కొండమీద ఎక్కి చుస్తే కనపడవు.
ఇది సాక్షిత్వ సాధన అంటే!ఆలోచనలను గుర్తించకూడదు.
వాటి వెంబడేపడి పోకూడదు.
(చూశాక గుర్తించకుండా ఎలా కుదురుతుందండి?)
నువ్వు సహజంగా వాటికి దూరం జరగాలి.
నేను beyond కదా! నేను అతీతుడిని కదా!

కుండని చూడగానే కుండ రూపం వచ్చేస్తుందండి మనసుకి.
అదే మనసు పని.
అసలు ఎవరు చూడమన్నారు నిన్ను?

దృక్ దృశ్య వివేకం అంటే అదే కదా!
దృశ్య రూపం ధరించడమే మనసు చేసే పని.
నిన్ను దృశ్యాన్ని ఎవరు పట్టించుకోమన్నారు?
నువ్వు దృక్ స్వరూపుడివి కదా!

నీ అంతరంగంలో....  
నీ సినిమా నీకు కనపడుతూ ఉంటుందండి.
ఏ సినిమా వస్తే, ఆ సినిమా నువ్వై పోతూ ఉంటావు.
నేనది కాదు కదా!
నేను అది కాదునే స్థిర నిర్ణయాన్ని నువ్వు కలిగి ఉండాలి.
ఆలా ఉంటేనే ఉదాసీనుడవై ఉంటావు.


విషయానికి / ఆలోచనకి అవుననో కాదనో నువ్వు reply ఇస్తే,
అది ఏదోఒక రూపంలో precipitate (అవక్షేపము) అవుతుంది.
(Precipitate means acting suddenly or without careful consideration)

కాబట్టి అవును, కాదు... అనక, తటస్థంగా ఉండడం నేర్చుకోవాలి.
అంతేగాని నిరోధం అంటే వ్యతిరేకించడమో ఆపడమో కాదు.

బాహ్య వ్యవహారంలో క్రియ కర్మలోకి దిగేటప్పుడు’...  
విశేషాన్ని అనుమతించకూడదు.
వ్యవహారం సామాన్య పద్ధతిలో చేయడం నేర్చుకోవాలి.
ప్రతి విషయంలో కూడా విశేషం ఉంటుంది.
ఆ విశేష లక్షణంలో... అహం ఉంటుంది.
అక్కడ దానిని అర్థం చేసుకొని,
అందులోని విశేష లక్షణాన్ని తొలగించి,
సామాన్య పద్ధతిగా చెయ్యాలి.
అప్పుడు దాంట్లో ఉన్న అహం తొలగిపోతుంది.
ఈ నాలుగు ఉపాయాలని ఉపయోగించి సాక్షిగా ఉండాలి.

1. ఉదాసీనుడవై ఉండుట (ఉత్తమమైన ఉపాయం)

2. అవుననక, కాదనక ఉండుట.

3. విషయంలో/ఆలోచనలో నేను భోగించడానికి సుఖ దుఃఖాలేవి లేవుగా!    
విషయంలో/ఆలోచనలో సుఖ దుఃఖాలు ఉన్నాయి అని అనుకోడం భ్రాంతి.

 

నీకు ఆ విధమైన భోగ్య భావన ఉన్నది కాబట్టే...
ఆ ఆలోచన నిన్ను వెంబడిస్తోంది.
అందులో నేను అనుభవించడానికి ఏమీ లేదు గా - అని అనుకోగానే అది నిన్ను వదిలేస్తుంది.


4. ఏదైనా చేసే ముందు దాంట్లో ఉన్న విశేష లక్షణాన్ని గమనించి...
అహం ఎలా బలపడుతుందో తెలుసుకొని,
అక్కడ సామాన్య లక్షణంతో ప్రవర్తించాలి.


 

ఇష్టాయిష్టాలు భ్రాంతి కదా!
విషయం మరియు విశేషం వచ్చినప్పుడు....
నువ్వు తాబేలు లాగా ఇంద్రియాలను లోపలికి ముడుచుకోవాలి.
అంతే గాని ఇతరులమీద రాగద్వేషాలు ప్రదర్శించడం ఎందుకు?


సృష్టి అంతా (అందరూ) ఈశ్వరుడే కదా!
ఎక్కడైనా నీ సాధనకు వ్యతిరేక వాతావరణం వస్తే,
తాబేలులా ఇంద్రియాలను ముడుచుకోడమే.
అదే సామాన్యం చేయడం అంటే (వ్యవహారంలో).
నువ్వు బైటికొచ్చి అది బాలేదు ఇది బాలేదు అనటం ఎందుకు?
నువ్వు అంతరసాధనలో నిమగ్నమై పోవచ్చునుగా?

బాహ్యంలో ఎప్పుడూ అరిషడ్వార్గాలు ఉంటాయండి.

ఉంటే ఏమిటట?
ఉండాలా వద్దా?
అలా అవి ఉంటేనే కదా!
వాటి వల్లే కదా పరిణామం.

కాబట్టి సృష్టి ధర్మంలో అవి వచ్చాయి.
మరి నేనేం చెయ్యాలి?
కరెంటు షాక్ కొడుతుందని తెలుసుకున్నావు.
కాబట్టి కరెంటు జోలికి వెళ్ళకు. ఇక్కడ కూడా అంతే!

ప్రపంచం అంతా నాకిష్టమొచ్చినట్లే ఉండాలంటే కుదరదు.
90% బాగుంది 10% బాలేదు.
10% ని పట్టించుకోకు.
అంటే ignore చెయ్యడం కాదు. అధిగమించాలి.
అంటే ఉదాసీనంగా చూడాలి.
10% అజ్ఞానం కదా! అని విచారించాలి.

నేను కూడా ఒకప్పుడు అజ్ఞానంలో అలానే ఉన్నాను కదా!
పిల్లలాట కదా అది.
పిల్లల్ని అజ్ఞానం ఆడొద్దు అంటే ఊరుకోరు.
కాబట్టి లౌకికుల్ని నువ్వు అలా ఉండొద్దు అంటే వినరు.
వారు తెలుసుకునేట్లు మనం చెయ్యాలి.
వారి తెలివిలోకి దిగి వెళ్లి, వారితో పాటు నడుస్తున్నట్లు,
అభ్యాసం చేస్తున్నట్లుగా నటించాలి.
అలా ఎన్నో సార్లు చెప్తే తప్ప వారికి రాదు.
కష్టపడి లౌకికులకి వచ్చేదాకా చెప్పాలి.
ఇలా platform తయారుచేయడమే కష్టం.
వాళ్ళ స్థాయికి దిగొచ్చి,
అదెట్లా అవునో, అదెట్లా కాదో వివరించి చెప్పే నేర్పు రావాలి.

శాస్త్ర పాఠం యథాతథంగా పక్కవారికి (ఇంట్లోవారికి) చెప్తే...
అది వికటిస్తుంది.
వారికి లేని పోని ఆలోచనలు వస్తాయి.
అపుడు ఆంక్షలు విధిస్తారు.
అపుడు పోరాటం ఏర్పడుతుంది.
మానవ సంబంధాలు చెడిపోతాయి.

ఎదుటివారి అజ్ఞానాన్ని అర్ధం చేసుకోవడమే కదా జ్ఞానం అంటే!
మరి, వారి స్థాయికి దిగివచ్చి చెప్తేనే వారు అది తీసుకుంటారు.

భార్యాభర్తల్లో...
ఒక్కొక్కరికి ఒక్కో విషయంలో తెలివి, సామర్ధ్యం ఉంటుంది.
అందరూ అన్ని విషయాలలో సమర్థులు కారు కదా!
ఎందులో ఎవరికి తెలివి ఉంటే,
వారు leader రెండవవారు follower.
ఇలా భార్యా భర్తల మధ్యలో leadership మారుతూ ఉంటుంది.
ఇది ఇద్దరూ అర్థం చేసుకొని శాంతంగా జీవించడం నేర్చుకోవాలి.

నీకొచ్చే అన్ని ఆలోచనలు స్మృతి జ్ఞానంలో ఉంటేనే వస్తాయి.
నేను అవుననో కాదనో ఇంతకముందు అన్నాను కాబట్టే,
అవి స్మృతి జ్ఞానంలోకి వచ్చాయి.


నీకు వచ్చే అన్ని ఆలోచనలను... ఉదాసీనుడనై చూసినప్పుడు,
నా list లోనుంచి అవి delete అయిపోతాయి.
అదే automatic గా delete చేసేసుకుంటుంది.
నువ్వేమీ చేయనక్కర్లేదు.
దాని పని అది routine process లో delete చేసేసుకుంటుంది.

(రద్దు చేసుకోడం నిర్వాణం తర్వాతేగా? క్రింద స్థాయిలలో కూడా రద్దు (డిలీట్) చేసుకోవచ్చా?)
మరి మెలకువ, కల, నిద్రలలో జరిగే process delete చేసుకోవడమే కదా!

నీకు నీ జీవితం అంతా గుర్తుందా?
అన్నీ daily wash లో వెళ్లిపోతున్నాయిగా!

నిర్వాణం తర్వాత మిగిలేవి...
కేవలం బలమైన చిత్త వృత్తులు మాత్రమే!
అవి అప్పుడు రద్దు చేసుకోవాలి.
మిగతావన్నీ వ్యవహార జ్ఞానం కదా!
అవన్నీ మూడు అవస్థల్లో delete అయిపోతుంటాయి
Temporary memory.
అలాంటివన్నీ delete చేసుకోవచ్చు. దానికి నిర్వాణం అవసరం లేదు.
అవన్నీ daily wash లో వెళ్లిపోతాయి.

అవన్నీ గుర్తుంటే... మానవుడు పిచ్చివాడు అయిపోతాడు.
కాబట్టి పరమాత్మ ఆలోచించే పెట్టాడు మూడు అవస్థలు.
అలా మూడు అవస్థలు లేకపోతే మానవుడికి పిచ్చి వచ్చేస్తుంది.
మానవుడికి బుద్ధి శక్తి వల్ల...
చూసే ఇంద్రియ జ్ఞానం బలంగా ఉంటుంది.
జంతువులకి అది బలహీనంగా ఉంటుంది.
జంతువులకి మనలా వాసనలు ఏర్పడవు.

అందుకే ఎప్పటికప్పుడు నిన్ను తొలగించుకొని ఈశ్వరుడిని పెట్టాలి.
సర్వ సృష్టికి ఈశ్వరుడే కదా కర్త.
నేను కర్త కాదు.
అపుడు అహం బలహీనపడి మన account లో కర్మలు వాసనలు పడవు.
కర్త, భోక్త లేకుండా ఉంటావు.
అపుడు ఏ ద్వంద్వాలు ఉండవు.
అపుడు సాక్షివేగా!
ఆ స్థితి స్వానుభవంలో తెలియాలి.
స్వప్రకాశాన్ని తెల్సుకోడమే నిర్వాణం.
ఇలా వరుస క్రమంలో ఎదగాలి.
            
ఈశ్వరుడిని పట్టుకోడమే భక్తి --->నిష్కామ కర్మ ---> నిర్వాణం ----> ఆత్మనిష్ఠ ----> బ్రహ్మ నిష్ఠ
బ్రహ్మ నిష్ఠ

ఆత్మనిష్ఠ
నిర్వాణం
నిష్కామ కర్మ
భక్తి
(ఈశ్వరుడిని పట్టుకోడము)

అప్పుడు క్రింద వాటివల్ల నువ్వు లాగపడవు.
లేదంటే పైకి ఎదిగాను అనుకుంటావు గాని కిందవి విదుల్చుకోలేదుగా!
మళ్ళా క్రిందికి పడిపోతూ ఉంటావు.

ఇప్పుడందరికీ ఇదే సమస్య!
అన్నీ తెలుసండీ, కానీ ఉండలేక పోతున్నామండీ! అంటారు.

నీ ఆంతరిక సాధనలో....
నువ్వెంతవరకు పురోగమిస్తున్నావన్న దాన్ని బట్టి అది ఉంటుంది.

బాహ్యంలో ఏలాంటి మార్పులూ వుండవు.

ప్రతి పనినీ తత్వ జ్ఞాన దృష్టితో చేయాలి, అప్పుడు కర్మ బంధాలు విడివడతాయి.

అవి ఎలా విడిపోతున్నాయో....
నువ్వు తెలుసుకుంటూ ఎదగాలి.
అపుడు స్వానుభూతి కల్గుతుంది.
అది స్వప్రమాణం.
శాస్త్ర ప్రమాణం ఎంత ప్రాముఖ్యత వహించిందో,
అట్లాగే స్వానుభూతి ప్రమాణం కూడా అత్యంత అవసరం.

ఎందుకంటే,
నీకు సహజమయ్యే జ్ఞానం స్వానుభూతి ప్రమాణమే!
శాస్త్ర ప్రమాణం సహజమయ్యే అవకాశం లేదుగా!
కాబట్టి, శాస్త్ర వాక్యం నాకు ఎలా సరిపోతుంది? అని చూసుకుంటూ ఎదగాలి.
దాంట్లోని ఒక్కొక్క భగాన్ని తీసుకుని....
నీకు అన్వయం చేసుకోవాలి (ఆచరించాలి).
అలా చేస్తే సందేహం వస్తుంది.
సందేహాన్ని గురువు  వద్ద తీర్చుకోవాలి.
అది “గురువాక్యం’.
అట్లా గురుబోధ వినగా వినగా ......
నువ్వు మారగా మారగా ......
నేనేగా మారాల్సింది.
ఎప్పుడూ ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చెయ్యకూడదు.
ప్రపంచాన్ని ఆధారం చేసుకొని నువ్వు ఎదగాలి.
నువ్వు ఎల్లప్పుడూ స్వరూపజ్ఞాన నిష్ఠలో ఉండాలి.
నువ్వు ఆత్మ నిష్ఠుడివై ఉండాలి.
ఇట్లా ఒక్కో step ఎదగాలి.
చివరి గమ్యం చేరేదాకా ఈ సృష్టేగా ఉపయోగపడేది.
ఈ శరీరమేగా.
వీటినలా పనిముట్లుగా ఉపయోగించుకుంటూ....
ప్రయాణం పూర్తి చెయ్యాలి.
అంతే గాని ప్రపంచం మీద వ్యతిరేక భావం వల్ల ప్రయోజనం లేదు.

జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ఇలా మూడు ఎక్కడున్నాయండి?
ఉన్నది ఈశ్వరుడే కదా!

నామరూపాల్లోకి ఈశ్వరుడు దిగి వస్తే జీవుడు, జగత్తు కనపడుతోంది. మరి మానసన్నా , బుద్ధన్నా , విషయాలన్నా, గుణాలన్నా, ఇలా ఎన్ని చెప్పినా ఇవన్నీ నామరూపాలేగా.

ఒక సారి నామరూపాలు దాటితే.... ఇవన్నీ ఉన్నాయా

అంగ శుశ్రూష అంటే
తను మన ధన ప్రాణములు నావి కాదు,
గురువుగారివే!
అని సాధన చెయ్యాలి కదా!
అలా సాధన చేస్తున్నప్పుడు ఏదైనా decision తీసుకోవాల్సి వచ్చినపుడు...
ఏం చెయ్యాలి ?

Decision తీసుకునే ముందు “అవసరమా?  అని ప్రశ్న వెయ్యాలి.
భోజనం చెయ్యడం అవసరమా?
ఇల్లు అవసరమా?
ఇలా ప్రశ్న వేసుకొని అవసరమైతేనే చెయ్యాలి!
అవసరం కాకపోతే చెయ్యడం అనవసరం.

అవసరం కోసమే చేసినప్పుడు...
అది నీకు అహం ఏర్పరచడం లేదుగా!!

విశేషం, extra చేసినప్పుడు అహం బలపడుతుంది.
విశేష వ్యవహారం వల్ల అహం బలపడిపోతుంది.
అవసరానికి మించి ఏదైనా చేస్తే దాన్ని నువ్వే మొయ్యాల్సి వస్తుంది.

ఉదాహరణకి నీకు, 8వ నంబర్ చెప్పులు సరిపోతాయి.
పెద్దగా ఉంటాయి కదా అని, 18వ నెంబర్ చెప్పులను కొన్నావనుకో,
అప్పుడు అవి నువ్వే మొయ్యాలి.

 

అవసరం అంటే దానికి లక్ష్యం ఉంటుందిగా!
లక్ష్యం ఎప్పుడూ వివేకం వైపు పెట్టాలి, అహం వైపు పెట్టకూడదు.
వివేకం వస్తే అహాన్ని తగ్గించుకోవాలి.
వివేకవంతుడికి అహం వుండదుగా!


నాకు ప్రపంచం అంతా అవసరమే,
ముక్తి కూడా అవసరమే అనేవాడు జిజ్ఞాసువు.
ఈ జిజ్ఞాసువే...
అన్నీ తెలుసండీ కానీ విషయం వచ్చినప్పుడు ఉండలేకపోతున్నాను అండిఅంటాడు.


ముక్తి ఒక్కటే కావాలనుకునేవాడు జ్ఞాని.
కాబట్టి జ్ఞానిగా మారాలి!
ముక్తి తప్ప మిగిలినవాటినన్నింటిని అవసరం లేదని వదిలెయ్యగలగాలి!

ఆరు రుచులే భిన్నమైన శాఖలలో కలిసి గుణ ప్రేరణను ఇస్తున్నాయి.
కాబట్టి ఆహరం మనసుని ప్రభావితం చేస్తుంది.
 

చిత్తం --> వ్యష్టి              చిత్ --> సమిష్ఠి

పంచశక్తులు పంచకర్తలకు సంబంధించినది సంచితం.
చిత్త వృత్తులు వ్యష్టికి సంబంధించినవి.
ప్రారబ్ధం సైకిల్ నిర్వాణం తర్వాతే తెలియబడుతుంది.

ప్రారబ్ధం ఎదురు వచ్చి బాయక నిలుచున్” (బాయక = పోకుండా) .

ఇపుడు నీకు ప్రారబ్ధం వచ్చి మీద పడిపోయేదాకా తెలియదు.
నిర్వాణం తర్వాత దేని వల్ల ఈ శరీరం వచ్చిందో నీకు తెలియబడుతుంది.
అవే తిరుగుతూ ఉంటాయి, కొత్త వేమి రావు.
వాటిని రద్దు చేసుకునే పనిలో వుంటాడిక.

జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి
జ్ఞానాగ్నిలో అయితేనే కర్మలు రద్దు  అవుతాయి.

ఎక్కడెక్కడైతే జీవభావం తోస్తుందో...
అక్కడల్లా నేను బ్రహ్మ స్వరూపాన్ని అని అనుసంధానం చేస్తాడు.
(ఇది ఆత్మానుభవం తర్వాత విషయం).

అట్లా చెయ్యగా చెయ్యగా...
ఉన్నది బ్రహ్మమే అనే స్థిరమైన జ్ఞానం కల్గుతుంది.

అపుడు మహా వాక్య ప్రమాణం చేత
మీకు అయమాత్మా బ్రహ్మ అనే స్థితిలో వున్నప్పుడు జ్ఞానాగ్ని ఉద్భవిస్తుంది. అప్పటివరకు జ్ఞానాగ్ని పుట్టదు.
ఆ జ్ఞానాగ్నిలో అన్నీ దగ్ధమైపోతాయి.

సామాన్య నియమాలనే పోషించలేనివారు విశేష నియమాలు ఎలా పోషిస్తారు?  కాబట్టి సమయ పాలన అత్యంత అవసరం.
యమ నియమాలు నిత్య జీవితంలో ఎప్పుడూ ఉండాలి.

అహం సాక్షి ఇతి యోవిద్యాద్‌ వివిచ్యైవ పునః పునః
స ఏవ ముక్తో స విద్వాన్‌ ఇతి వేదాంత డిండిమః
నేను సాక్షి స్వరూపమును అనే జ్ఞానమును.... మరల మరల మనస్సు నందు గ్రహించుకొనిన వాడు, జ్ఞాననిష్ఠ పొందినవాడు, వాడే విద్వాంసుడు. అతడే ముక్తుడు అని వేదాంతము ఘోషించుచున్నది.

ఓం పూర్ణ మదః పూర్ణమిదం పూర్ణాత్‌ పూర్ణ ముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే
ఓం శాంతిః శాంతిః శాంతిః


Download PDF